టీ-20 వరల్డ్ కప్‌లో దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో థ్రిల్. దాయాదిపై సమరం ఓ సూపర్ ఎన్‌కౌంటర్‌లా ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేక్షకులు టీవీలకే హత్తుకుపోతారు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఆ మజాయే వేరు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యంత రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచకప్ టోర్నీల్లో ఒక్కసారి కూడా పాక్ చేతిలో భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పాక్ జట్టు కసిగా ఉంది. భారత్-పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కి డబుల్ దమాకా. బెట్టింగ్ రాయుళ్లకు కోట్లు కురిపించే మ్యాచ్. ఈ సూపర్ సండే రోజున భారత్-పాకిస్తాన్ నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం బెట్టింగ్ రాయుళ్లు కాచుకుని కూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ ఎత్తున బెట్టింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్‌లో ఈ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాకిస్తాన్‌పై వెయ్యికి రూ.1,600… భారత్ గెలిస్తే వెయ్యికి రూ.2 వేలు ఇస్తామంటూ బెట్టింగ్ రాయుళ్లు ఆశ చూపుతున్నారు. టాస్ నుంచి మొదలుకొని ఏ బ్యాట్స్‌మెన్ ఎంత కొడతాడనే దానిపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లలో పెద్ద తెరలపై క్రికెట్ ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ క్లబ్‌లలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.