మా ఎన్నికల ప్రచారం ఎంత రచ్చ రచ్చగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు చలపతిరావు తనయుడు డైరెక్టర్, నటుడు రవిబాబు కూడా గొంతు విప్పారు. 2 నిమిషాల పాటు ఉన్న ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. ఇది నాన్‌లోకల్, లోకల్ ఇష్యూ కాదంటూనే ఆయన టాలీవుడ్లో జరుగుతోన్న తీరుతెన్నులపై విరుచుకు పడ్డారు.
ఒక్క హైదరాబాద్ సిటీలోనే 150 మంది టాలెంటెడ్ కె మేరామెన్లు ఎలాంటి పనిలేకుండా పడి ఉన్నారని.. ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ నటులు ఉన్నా కూడా పరభాషా నటులను తెచ్చి వారి డిమాండ్లకు తలొగ్గి.. వారు చెప్పినట్టు వింటున్నారని ఆయన వాపోయారు. పరాభాషా నటులు, టెక్నీషియన్లు తెచ్చుకుని.. చివర్లో వారి బిల్లులు చూసి నిర్మాతలు గుండెలు బాదుకుంటున్నారని రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు హెయిర్ డ్రెస్సర్లతో పాటే మేకప్‌మెన్‌లను కూడా పక్క రాష్ట్రాల వారినే తెచ్చుకుంటున్నారు.. చివరకు మా అనేది మనం ఏర్పాటు చేసుకున్న చిన్న ఆర్గనైజేషన్.. దీనిని నడపడానికి కూడా పరభాషల నుంచి మనుష్యులను తెచ్చుకోవాలా ? అని ప్రశ్నించారు. రవిబాబు చెప్పిన పాయింట్ అయితే కాస్త ఆలోచించేలాగానే ఉంది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం రవిబాబు వీడియో ద్వారా పరోక్షంగా మంచు విష్ణుకే సపోర్ట్ చేసినట్టు స్పష్టమైంది. అయితే ఆయన చెప్పిందాంట్లో మాత్రం అర్థం ఉంది.