కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం కేవలం శాండల్ వుడ్‌ను మాత్రమే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమను సైతం తీవ్ర విషాదంలో నింపేసింది. చిన్న వయస్సులోనే స్టార్ హీరోగా ఉన్న పునీత్ మృతి అందరికి షాక్ ఇచ్చింది. పునీత్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ స్టార్ హీరోలు అందరితోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. పునీత్ తండ్రి కన్నడంలో లెజెండ్రీ యాక్టర్ రాజ్ కుమార్ కావడంతో ఆ తరం నుంచే ఇక్కడ సినిమా కుటుంబాలు అయిన నందమూరి, అక్కినేని, కొణిదెల, ఘట్టమనేని ఫ్యామిలీలకు చెందిన హీరోలతో అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.
ఇక మహేష్‌బాబు దూకుడు సినిమాను తాను పవర్ పేరుతో అక్కడ రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఇక పునీత్ తొలి సినిమా అప్పు. దానినే పూరి జగన్నాథ్ ఇక్కడ రవితేజ హీరోగా ఇడియట్ పేరుతో రీమేక్ చేస్తే ఆ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. విచిత్రం ఏంటంటే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ డిజాస్టర్ సినిమాను పునీత్ కన్నడంలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
2004 జనవరి 1న పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆంధ్రావాలా సినిమా ఇక్కడ ప్లాప్ అయ్యింది. ఆంధ్రావాలా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయ్యింది. అదే సినిమాను పునీత్ కన్నడంలో రీమేక్ చేశారు. ఈ సినిమాను కూడా మన తెలుగు డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్ట్ చేశారు. అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టింది.