టాలీవుడ్ లో కమెడియన్ గా రాణించిన సుహాస్ హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. ఎంట్రీ మూవీ ‘కలర్ ఫోటో’ కి మంచి అప్లాజ్ దక్కడంతో ప్రస్తుతం ఆయనతో సినిమాలు తీయడానికి పలువురు దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈయన “ఫ్యామిలీడ్రామా” అనే సినిమా తీస్తున్నారు. మెహెర్ తేజ్ స్వీయ దర్శకత్వంలో తేజ కాసరపుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది.
సైకో థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సుహాస్ పాత్ర వైవిద్యంగా వుంటుందని, డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాగా చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందనే విశ్వాసాన్ని దర్శకుడు తెలియజేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆసక్తికరంగా సాగింది ఫ్యామిలీ డ్రామా ట్రైలర్. ‘ఈత రానివాడు సముద్రాన్ని తిట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో..వినడం రానివాడు సంగీతం గురించి మాట్లాడినా అంతే అసహ్యంగా ఉంటుంది’ అని సుహాస్ చెప్పిన డైలాగ్ మెప్పిస్తుంది. పూజా కిరణ్, అనుషా నూతుల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అజయ్ అండ్ సంజయ్ అందిస్తున్నారు.
ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా.. ఓటీటీలో విడుదలవుతుండడం గమనార్హం. ఈ నెల 29న సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ సంస్థ ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలియచేసింది. ఇంతకు ముందెన్నడూ కనివినీ ఎరుగని సినిమా ‘ఫ్యామిలీ డ్రామా’ అంటూ ఓ పోస్టర్ ను కూడా షేర్ చేసింది. రిలీజ్ అయిన ట్రైలర్ ను బట్టి చూస్తుంటే..సుహాస్ ఖాతాలో మరో హిట్ పక్క అనిపిస్తుంది.