తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలిచారు. ఆ తర్వాత నుంచి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ ట్విస్టులు ఇస్తోంది. ముందుగా ఫలితాలు రాకుండానే ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ సైతం తాను కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సైతం అదే బాట పట్టారు.
అయితే ఈ రోజు ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ అంతా ప్రెస్‌మీట్ పెట్టి ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ నుంచి గెలిచిన 11 మంది కూడా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమా బిడ్డలం ఫ్యానెల్ నుంచి గెలిచిన వారంతా కూడా తమ పదవులు వదులుకుంటున్నట్టు చెప్పారు. అయితే ఈ రెండేళ్ల పాటు విష్ణు ఫ్యానెల్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. అందుకు తాము ఈ రెండేళ్లు ప్రశ్నిస్తూనే ఉంటామని.. విష్ణు ఫ్యానెల్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ఫ్యానెల్ సభ్యులు చెప్పారు.