దర్శకరత్న దాసరి నారాయణ రావు ఏ విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తుంటారు. సినిమా రంగంలో తిరుగులేని దర్శకుడిగా ఉన్న ఆయన ఎన్టీఆర్‌తో ఎన్నో హిట్ సినిమాలు చేసినా కూడా అదే ఎన్టీఆర్‌తో రాజకీయంగా మాత్రం విబేధించారు. ఇక ఈనాడునే ఢీ కొట్టేలా ఉదయం పేపర్ స్థాపించి మరుగున పడిన ఎన్నో నిజాలను నిర్భయంగా నాడు ప్రజలకు అందించారు. నాడు ఎన్టీఆర్ పాలనలో లోపాలను ఎత్తి చూపుతూ తన సినిమాల్ల సీన్లు పెట్టేవారు.
ఇక విజయశాంతితో దాసరి నారాయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఒసేయ్ రాములమ్మ రాజకీయంగాను, సినిమా రంగంలోనూ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ సినిమా చంద్రబాబు ప్రభుత్వ పతనానికి పడిన బీజాల్లో ఒకటిగా చెపుతారు. ఇక చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక మోహన్ బాబు లాంటి వాళ్లతో ఆయన మేస్త్రి సినిమా తీశారు. ఈ సినిమా కూడా చిరునే టార్గెట్ చేసి తీసినట్టు ఓ ప్రచారం ఉంది.
అయితే ఇవే కాకుండా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలనను , ఆయన ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ కూడా దాసరి ఓ సినిమా తీశారు. అదే ఎమ్మెల్యే ఏడు కొండలు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పటకి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ కూడా సినిమా తీశారు. ఏదేమైనా దాసరి లోపాలను ఎత్తి చూపడంలో ఎక్కడా సందేహించే వారే కాదు అనేందుకు ఇదే నిదర్శనం.