ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 పేరుతో ఫేక్ ప్రచారం జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆ ఛానెల్ లబోదిబో మంటోంది. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న చెరకు శ్రీనివాస్‌రెడ్డి తిరిగి టీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ టీవీ 9 ఛానెల్ లోగో పేరిట కొన్ని క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్లిప్పింగ్‌లతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. అయితే కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహంతో టీవీ 9 స్పందించింది.
ఈ వార్తతో తమకు సంబంధం లేదంటూనే.. టీవీ 9 పేరు పోగొట్టేలా ఈ చర్యకు పాల్పడిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. తాము సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశామని కూడా టీవీ 9 చెప్పింది. మరోవైపు తనపై పార్టీ మార్పు వార్తలు వస్తుండడంతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి మండిపడుతున్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తనపై వస్తోన్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా ఈ ఫేక్ ప్రచారంతో టీవీ 9 లబోదిబో మంటోంది.