తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు అధికార పార్టీలో కాక రేపుతున్నాయి. మంగళవారం గులాబీ పార్టీకి అదిరిపోయే షాక్ తగిలింది. టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మృతి చెందిన రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ప్రకటించడంతో ఇక్కడ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి చెరకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో ముత్యంరెడ్డి ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రామలింగారెడ్డిని ఓడించారు.
ఇక శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో పలువురు కీలక నేతలతో కలిసి మంగళవారం సాయంత్రం టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ దుబ్బాక ఉపఎన్నిక.. తెలంగాణ భవిష్యత్ ఎన్నిక అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని అని నియోజకవర్గ ప్రజలను ఉత్తమ్ కోరారు. ఈ క్రమంలోనే రేపే శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు.
గజ్వేల్, సిద్ధిపేటలో జరిగిన అభివృద్ది దుబ్బాకలో ఎందుకు జరగలేదని కూడా ఉత్తమ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే దుబ్బాకలో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో పాటు ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుండడంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు అధికార పార్టీకి మైనస్‌గా మారతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు బీజేపీ నుంచి మరో బలమైన నేత రఘునందన్‌రావు రేసులో ఉండడం, ఇటు కాంగ్రెస్ నుంచి నియోజకవర్గంలో మంచి పేరున్న ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉండడంతో గులాబీ గూటిలో గుబులు స్టార్ట్ అయ్యింది.