రాజకీయాలకు తెలుగు సినిమాలకు ఉన్న అవినాభావ సంబంధం ఈ నాటిది కాదు.. నాడు ఎన్టీఆర్, కృష్ణ… ఇంకా చెప్పాలంటే అంతకుముందు జగ్గయ్య నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలో చాలా మంది సినీనటులు ఉన్నారు. వీరిలో ఒకరు ఎంపీగా కూడా ఉండడం విశేషం. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్‌సీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి 1.20 ఓట్ల పైచిలుకు భారీ మెజార్టీతో విజయం సాధించారు.
మార్గాని భరత్ ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ విప్‌గా కూడా ఉన్నారు. అయితే భరత్ టాలీవుడ్ హీరో కూడా. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సత్యం చల్లకోటి దర్శకత్వం వహించిన ఓయ్ నిన్నే సినిమాలో భరత్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సృష్టి దంగే నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న విధంగా ఆడలేదు. అయితే మనోడికి ఈ సినిమాతో రొమాంటిక్ హీరో అన్న పేరు వచ్చింది.
ఇక ఎన్నికలకు ముందు వరకు భరత్ టీడీపీలో ఉండేవాడు. భరత్ తండ్రి బీసీ సంఘాల్లో కీలక నేతగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ఆశీస్సులతో వైసీపీలో చేరి తొలి ప్రయత్నంలో… అందులోనూ చిన్న వయస్సులో భరత్ లోక్‌సభ ఎంపీ అయ్యాడు. అన్నట్టు టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ నవనీత్ కౌర్ సైతం మహారాష్ట్రలోని అమరావతి నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు.