టీడీపీ అధినేత చంద్రబాబు.. పాలనపరంగా దూరంగా ఉన్నప్పటికీ.. ప్రజలకు సేవ చేయడంలో మా త్రం.. తనదైన శైలిని అవలంబిస్తున్నారని చెప్పకతప్పదు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలకు ఎలా అంటిపెట్టుకుని ఉంటారు? అనే సందేహాలు సహజంగానే వస్తాయి. నిజమే! ప్రతిపక్షంలో ఎవరు ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై నాలుగు విమర్శలు చేయడం, నాలుగు వ్యాఖ్యలు కుమ్మరించడం వరకే పరిమితమవుతారు.
ఇది సహజంగా జరిగే ప్రక్రియ. లేదా.. ఏదైనా విషయం ఉంటే.. తమ సలహాలు ఇచ్చి.. అంతవరకు పరిమితమవుతారు. మరికొన్ని చోట్ల అవకాశం చిక్కితే.. ప్రభుత్వాలను పడగొట్టి తాము సీఎం కుర్చీని అందుకునేందుకు ప్రయత్నిస్తారు.కానీ, ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు.. నిర్మాణాత్మక పాత్రను.. పోషిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. నిజానికి ఆయన ఇప్పుడు ఈ వయసులో ఇంట్లో పడుకున్నా ఎవరూ అడగరు. కానీ, ఆయన నిత్యం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ..రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నారు.
అదే సమయంలో రాష్ట్రంలో కరోనా విజృంభించిన నేపథ్యంలో ఆయన చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. దేశం సహా అమెరికా, బ్రిటన్‌లో ఉన్న తెలుగు వైద్యులతో ఆయన వెబినార్ సమావేశం నిర్వహించి.. ఈ వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఫలితంగా .. కొంత మార్పు వచ్చింది. ఇక, ఇప్పుడు బాబు.. ఇలాంటిదే మరో ప్రయోగం చేశారు. “ఏపీ ఫైట్స్ కరోనా.కామ్“ అనే వెబ్‌సైట్‌ను చంద్రబాబు స్వయంగా తన స్వహస్తాలతో ప్రారంభించారు. దీనిద్వారా.. ఎవరైనా.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తమ పరిస్థితిని చంద్రబాబుకు తెలియజేయవచ్చు.
కరోనా రోగులైనా, లేదా కరోనా ఎఫెక్ట్‌తో నిరుద్యోగులు అయినా.. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపార వర్గాలైనా కూడా తమ సమస్యను చంద్రబాబుకు నేరుగా ఈ సైట్ ద్వారా చెప్పుకొనే అవకాశం ఉంది. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు.. అసెంబ్లీలోనూ ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల గుండె చప్పుడును వినేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారన్న మాట..!