ప్రపంచంలోనే అందమైన మహిళా ప్రధానుల్లో ఒకటిగా పేరున్న న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ మరోసారి ఘనవిజయం సాధించారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో ఆమె ఆధ్వర్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న లేబర్ పార్టీ మరోసారి విజయం సాధించడంతో జసిండా వరుసగా రెండోసారి న్యూజిలాండ్ ప్రధానిగా అధికారం చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 83.7శాతం ఓట్లు పోలవగా.. 49శాతం ఓట్లను దక్కించుకుంది.
ఇక ప్రతిపక్ష నేషనల్ పార్టీని ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఆ పార్టీకి కేవలం 27 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా రెండోసారి ప్రధానిగా గెలిచిన జసిండా అర్డెర్న్ మీడియాతో మాట్లాడుతూ తనను రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వచ్చే మూడు సంవత్సరాల్లో న్యూజిలాండ్‌లో చేయాల్సింది చాలా ఉందన్నారు.
దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఇక కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధానిగా జసిండా అర్డెర్న్‌కు ప్రజల్లో మంచి పేరుంది. ఈ క్రమంలో ఆమెను మరోసారి ప్రజలు ఎన్నుకున్నారు.