ప్రముఖ కోలీవుడ్ రచయిత వైరముత్తుపై సింగర్ చిన్నయి కొద్ది రోజులుగా మీటు ఉద్యమంలో భాగంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన తనను లైంగీకంగా వేధించాడని చిన్మయి ఇప్పటికే పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా వైరముత్తు ఓ ప్రముఖ తమిళ ఛానెల్ ఉద్యోగినిని కూడా లైంగీకంగా వేధించేవారని.. తనను చెన్నైలోని ఓ ప్రాంతానికి రావాలంటే వేధించిన విషయాన్ని ఆమె చిన్నయితో పంచుకున్నారు. ఈ ఆవేదనను చిన్మయి సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఇది వైరల్ అవుతోంది.
తాను విదేశీ టూర్లో ఉన్నప్పుడే వైరముత్తు తనను ఆయన గదికి రావాలంటూ ఓ మహిళతో కబురు పంపాడన్న విషయంపై గతంలోనే ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు ఏ మహిళా ఉద్యోగిని అయితే ఆరోపణలు చేసిందో ఆమె పంపిన స్క్రీన్ షాట్లు బయట పెట్టిన చిన్మయి ఆమె పేరు మాత్రం చెప్పలేదు. తన పేరు బయట పెట్టవద్దని ఆ మహిళ విజ్ఞప్తి చేసిందని చిన్మయి చెప్పింది.
ఇక సదరు మహిళ చిన్మయికి పంపిన మెసేజ్‌లో తాను కాలేజ్ విద్యార్థినిగా ఉన్నప్పుడు ఓ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో వైరముత్తు ఆటోగ్రాఫ్ తీసుకున్నానని.. అందులో ఆయన తన ఫోన్ నెంబర్ కూడా రాశారని.. తనది చిన్న వయస్సు కావడంతో ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారో తనకు అర్థం కాలేదని పేర్కొంది. ఆ తర్వాత తాను తమిళ్ ఛానెల్లో చేరినప్పుడు ఆయన నా ఫోన్ నెంబర్ తీసుకుని వేధించడంతో తాను షాక్‌కు గురయ్యానని ఆ మహిళ సందేశంలో తెలిపింది.
కేవలం గంటలోనే 50 సార్లు ఫోన్ చేసి వేధించడంతో చివరకు ఆ విషయాన్ని తాను ఛానెల్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వారు వైరముత్తు భార్యకు చెప్పగా ఆమె స్వయంగా తన మొగుడికి వార్నింగ్ ఇచ్చిందని పేర్కొంది. ఇప్పుడు చిన్మయి షేర్ చేసిన ఈ మెసేజ్ బాగా వైరల్ అవుతోంది.