డ్రగ్స్ కేసులో అరస్టు అయిన కన్నడ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదికి కస్టడీ పొడిగించాలని ఎన్డిపీఎస్ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరిని అక్టోబర్ 23 వరకు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉండాల్సిందే అని కోర్టు ఆదేశాలు చెపుతున్నాయి. వీరి బెయిల్ దరఖాస్తును కూడా తిరస్కరించారు. వీరిలో సెప్టెంబర్ 4న రాగిణిని అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత సెప్టెంబర్ 8న సంజనను అరెస్టు చేశారు.
ఈ ఇద్దరు నటీమణులు ముందుగా ఒకే రిమాండ్ హోమ్‌లో ఉన్నారు. తర్వాత వీరిని సెంట్రల్ జైలుకు పంపారు. వీరు జైల్లోనే ఒకరినొకరు పచ్చి బూతులు తిట్టుకుంటున్నారట. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతుండడంతో పోలీసులు వాటిని వినలేక చెవులు మూసుకుంటోన్న పరిస్థితి ఉందంటూ కన్నడ మీడియా రాస్తోంది. అసలు ఈ ఇద్దరికి ఇంతకుముందే పడదు. ఇప్పుడు ఈ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉండడంతో పాటు తిట్లు తిట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారిందట.
రాగిణికి రాత్రి వేళల్లో చాలా లేట్ నైట్ వరకు మేల్కొని ఉండడంతో పాటు పుస్తకాలు చదివే అలవాటు ఉందట. అయితే అప్పటి వరకు లైట్లు వేస్కొని ఉండడంపై సంజన ఫైర్ అవుతోందట. రాగిణి తన యోగా కోసం ఉదయాన్నే నిద్ర లేవడంతో సంజన నిద్రకు డిస్టర్బ్ అవుతోందట. దీంతో సంజన రాగిణిపై కస్సుబుస్సు లాడడంతో ఆమె కూడా తిరిగి అంతే ఘాటుగా స్పందిస్తోందట. దీంతో వీరిద్దరి యుద్ధంతో పోలీసులు పరేషాన్ అవుతోన్న పరిస్థితి ఉంది.