దేశవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు పెళ్లి విషయమే పెద్ద హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రభు వయస్సులో తన కంటే 20 ఏళ్లు చిన్నది అయిన ఓ విద్యార్థిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సదరు ఎమ్మెల్యే తన కుమార్తెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడంటూ ఆ అమ్మాయి తండ్రి కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ వివాహానికి దేశ వ్యాప్తంగా మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
తాజాగా శుక్రవారం మద్రాస్ హైకోర్టు ఈ పెళ్లిపై సంచలన తీర్పు ఇచ్చింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభుకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేతో పాటు పెళ్లి చేసుకున్న సౌందర్య ఇద్దరూ కూడా మేజర్లు కావడంతో ఈ ప్రేమ పెళ్లి చెల్లుతుందని కోర్టు తెలిపింది. ఇద్దరు మేజర్లు కావడంతో వీరి వివాహానికి అభ్యంతరం లేదని కోర్టు చెప్పింది.
ఇక సౌందర్య తండ్రి తమ కుమార్తెను అప్పగించాలంటూ మద్రాస్ హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అతడు దాఖలు చేసిన పిల్‌ను కొట్టి వేసింది. ప్రస్తుతం సౌందర్య బీఏ ఇంగ్లిష్ రెండో ఏడాది చదువుతున్నారు. ఆమె తండ్రి అదే ఊరిలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువతి కావడంతో తమిళనాట బ్రాహ్మణ సంఘాలు ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నాయి.