భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. పలు చోట్ల తీవ్రంగా పంట నష్టం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో కోస్తా ఆంధ్రాతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాల కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో చెరువు అలుగు పొంగి తండ్రి, కొడుకులు కొట్టుకుపోయారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండల కేంద్రంలో రాధోనీ చెరువు అలుగు పొంగుతోంది.
చెరువు అలుగు పొంగుతుండగానే.. తండ్రి కొడుకులు తమ బైక్‌పై ఈ అలుగు దాటాలని చూశారు. ఈ క్రమంలోనే వరద ఉధృతికి తండ్రికొడుకులు ఇద్దరు కొట్టుకుపోయారు. చెరువుకు అవతల వైపు ఉన్న తమ పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వీరు బైక్‌తో సహా దిగువకు కొట్టుకుపోయారు. వీరిలో కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు రాగా.. తండ్రి గల్లంతైనట్టు తెలుస్తోంది.
ఈ విషయం తెలియడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని గాలిస్తున్నారు. పోలీసులు సైతం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కింద వెతకడం కష్టంగా ఉందని స్థానికులు చెపుతున్నారు.