ప్రస్తుతం ప్రపంచం అంతా అమెరికా ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోంది. రెండోసారి వరుసగా అధ్యక్షుడు కావాలని డొనాల్డ్ ట్రంప్, మరోవైపు తొలిప్రయత్నంలోనే అధ్యక్షుడు అవ్వాలని జో బైడెన్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్సిల్లా చాన్ నవంబర్లో జరిగే ఎన్నికల సదుపాయాల కోసం భారీ విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఈ దంపతులు కరోనా సమయంలో అమెరికాకు ఏకంగా 300 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు.
కరోనా సమయంలో విధులు నిర్వహిస్తోన్న వారి కోసం 300 మిలియన్ డాలర్ల నిధులు ఇచ్చిన ఈ దంపతులు ఇప్పుడు అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, మౌలిక సదుపాయాల కోసం ఏకంగా 100 మిలియన్ డాలర్ల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల అధికారుల నుంచి మేం ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని ఈ జంట ప్రకటించింది. ఈ విషయాన్ని జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో పేర్కొన్నారు.
ఇక ఇప్పటి వరకు 2100 మందికి పైగా సీటీసీఎల్‌కు దరఖాస్తులు సమర్పించారని కూడా జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. సీటీసీఎల్ అనేది చికాగోకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ. ఇది అమెరికా ఎన్నికలను ఎప్పటికప్పుడు మరింత ఆధునికీకరించాలని ప్రయత్నాలు చేస్తోంది.