టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీది ఏడెనిమిది దశాబ్దాల అనుబంధం. ఈ ఫ్యామిలీలో మూడో తరం హీరోలుగా అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ దూసుకుపోతున్నారు. దివంగత లెజెండ్రీ హీరో ఏఎన్నార్ తర్వాత రెండో తరంలో ఆయన తనయుడు కింగ్, మన్మథుడు నాగార్జున స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలాడు. ఇప్పుడు నాగ్ వారసులు చైతు, అఖిల్ మూడో తరం హీరోలుగా కొనసాగుతున్నారు.
ఇక అక్కినేని నాగేశ్వరరావు తన కుటుంబంలో చాలా మందికి ముందుగా న అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు పెట్టారు. ఇందులో నాగేశ్వరరావు పేరుతో పాటు నాగసుశీల, నాగార్జున, నాగచైతన్య ఇలా చాలా మంది పేర్లు ముందుగా న అక్షరంతో ప్రారంభమయ్యాయి. ఇక నాగార్జునకు ఆ పేరు పెట్టడం వెనక అసలు రహస్యాన్ని నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
నాగార్జున పుట్టిన సమయంలోనే తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకునే వారు. నాగార్జునా సాగర్‌ను ఆధునిక దేవాలయం అనేవారు. ఈ ప్రాజెక్టుకు వచ్చిన క్రేజ్ చూసిన ఏఎన్నార్ తన వారసుడికి నాగార్జున అని పేరు పెట్టారట. ఈ విషయాన్ని పలుసార్లు ఆయనే స్వయంగా చెప్పారు.
ఆ తర్వాత నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించ దగ్గ హీరో అయ్యాడు. ఇప్పుడు తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇంత వయస్సు వచ్చినా తాను కూడా వెండితెరతో పాటు బుల్లితెరపై సైతం దూసుకుపోతున్నాడు.