తమిళ రాజకీయాల్లో అధికార అన్నాడీఎంకేలో సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై కొద్ది రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. సీఎం పదవి కోసం ఇద్దరు కీలక నేతల మధ్య నెలకొన్న వివాదం కాస్తా ఎట్టకేలకు ముగిసింది. పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం మధ్య నెలకొన్న గొడవ నేపథ్యంలో పార్టీ కీలక నేతలు, మంత్రులు రాజీ కుదిర్చారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నిక్లలో సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఉండనున్నానరు.
బుధవారం ఈ ఇద్దరు నేతలు కలిసి సీఎం అభ్యర్థిపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. సీఎం అభ్యర్థి విషయంలో గత నెల 28న జరిగిన సమావేశంలో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం వాగ్వాదానికి దిగడంతో ఆ పార్టీలో తీవ్ర కలకలం బయల్దేరింది. ఇద్దరు ఎవరికి వారే సీఎం పదవి కావాలని పట్టుబట్టడంతో ఈ పదవి ఎవరికి దక్కుతుంది ? అన్న దానిపై పెద్ద ఉత్కంఠే నెలకొంది. ఆ తర్వాత పన్నీరు సెల్వం తన మద్దతుదారులతో మూడు, నాలుగు విడతలుగా సమావేశమయ్యారు.
చివరకు పార్టీ భవిష్యత్తు కోసం అయినా పట్టు సడలించాలని పన్నీరు సెల్వంకు పలువురు సూచించడంతో ఆయన ఓ మెట్టు దిగి వచ్చారు. దీంతో ఆయన బుధవారం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామినే ప్రకటించేందుకు సహకరిస్తానని స్పష్టం చేశారు. మంత్రుల రాయబారంతో పన్నీర్‌సెల్వం తన పట్టు సడలించారు. అయితే వీరి మధ్య సమన్వయం కోసం ఓ మార్గదర్గక కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో ఎడప్పాడి వర్గానికి చెందిన ఐదుగురు, పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఏ వర్గానికి చెందని తటస్థంగా ఉండే సీనియర్ నాయకుడు కూడా సభ్యుడిగా ఉంటారు.