ప్రపంచ క్రికెట్ స్వరూపం రోజు రోజుకు మారిపోతోంది. ఒకప్పుడు ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌ల స్థానంలో వచ్చిన వన్డే మ్యాచ్‌లు రంజుగా మజాను పంచాయి. వన్డే క్రికెట్‌కు ఆదరణ పెరిగాక టెస్టులు చూసేవారే కరువయ్యారు. ఇక టీ 20 మ్యాచ్‌లు వచ్చాక ఇప్పుడు అంతా ఈ పొట్టి క్రికెట్ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు మూడు గంటల్లో ముగిసే టీ 20 క్రికెట్ లీగ్‌లు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో జరుగుతున్నాయి. టీ 20 క్రికెట్లో ఊరు పేరు లేని దేశాలు కూడా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి.
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 సంవత్సరాలుగా ఎంతో సక్సెస్ అవుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ కరోనా నేపథ్యంలో వాయిదా పడి ప్రస్తుతం షార్జా, అబుదాబి, దుబాయ్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు టీ 10 క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. వచ్చే యేడాది ప్రారంభంలో అబుదాబీ వేదికగా ఈ టీ 10 లీగ్ టోర్నమెంట్ జరుగుతుంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఈ లీగ్ జరుగుతుంది. ఈ యేడాది ఆరంభంలో నిర్వహించిన టీ 10 లీగ్‌కు మంచి స్పందన వచ్చింది.
ఈ టీ 10 లీగ్‌ను టీవీల్లో ఏకంగా 80 మిలియన్ల మంది వీక్షించారు. సోనీ స్పోర్ట్స్ ఛానెల్ ఈ లీగ్‌ను ప్రసారం చేయనుంది. టీ10 లీగ్ నిర్వహణలోనూ కీలకమైన బయో సెక్యూర్ బబుల్ వాతావరణాన్ని అమలు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.