టీడీపీ అధినేత చంద్రబాబు అంటే అధికార వైసీపీ నేతల్లో బాగా వణుకు పుడుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు ఎవరి అక్రమాలు బయట పెడతారా లేక, ప్రభుత్వంలో ఉన్న లొసుగులని బయటపెడతారో అన్న ఆందోళన అయితే వైసీపీ నేతల్లో ఉంది. అందుకే అనుకుంటా ఇంకా అధికారంలోకి వచ్చినా కూడా వైసీపీ నేతలు, చంద్రబాబే సీఎం అన్నట్లు ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆయనపైనే వారు నిరసనలు తెలియజేస్తున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్న రాష్ట్రంలో జరిగే పరిస్థితి ఇదే. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని తెలుగు తమ్ముళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
చిన్న స్థాయి కార్యకర్త నుంచి బడా నేత వరకు అక్రమాలు, దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటీవల కూడా ఏపీలో దళితులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు దళిత యువకులకు శిరోముండనం కూడా చేశారు. ఇదే అంశంపై టీడీపీ ఫైట్ చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం దళితులపై దాడులు చేస్తుందని ఫైర్ అవుతున్నారు. అయితే దళితులపై దాడులు జరిగే విషయంలో వైసీపీ నేతలు ఉన్నారో లేదో తెలియదు గానీ, వారి ప్రభుత్వంలోనే జరుగుతున్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు.
పైగా హోమ్ మంత్రి కూడా అదే వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండి, ఇలాంటి దాడులని ఎందుకు ఖండించడం లేదని నిలదీస్తున్నారు. అసలు దళితులపై దాడులు విషయంలో తగిన చర్యలు తీసుకోకుండా రివర్స్‌లో వైసీపీ నేతలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం విచిత్రంగా ఉందని అంటున్నారు. అసలు ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నారా…లేక చంద్రబాబు సీఎంగా ఉన్నారా అనే విషయం కూడా అర్ధం కావడం లేదని, వారి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు జరిగితే వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేయడం ఏంటో అర్ధం కావడం లేదని చెబుతున్నారు. ఏదేమైనా వైసీపీ నేతలకు ఇంకా చంద్రబాబే సీఎం అనుకుంటా అన్న సెటైర్లు ఇప్పుడు పొలిటికల్, మీడియా సర్కిల్స్‌లో పెరిగాయి.