ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ( 74) కన్నుమూశారు. గత రాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. ఆయన ఓ వ్యవసాయ కుటుంబంలో 1946లో జన్మించారు. అయితే పుట్టింటి కర్నూలు జిల్లా అయినా ఆయన సెటిల్ అయ్యింది మాత్రం గుంటూరులోనే. తెలుగులో ఆయన బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా చిత్రపరిశ్రమలో అడుగు పెట్టారు.
రాయలసీమ యాసలో జయప్రకాశ్‌రెడ్డి నటన ఆయన్ను ఓ స్థాయికి తీసుకెళ్లింది. సమరసింహారెడ్డి, ప్రేమించుకుందాం రా, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు చిత్రాల్లో ఆయన నటన విలనిజానికే కొత్త పంథాను తెచ్చింది. కరుడు గట్టిన విలన్‌గాను, కామెడీ విలన్‌గాను, కమెడియన్‌గాను ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన నటన ఆయనకు ఎన్నో కీర్తి ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
జయప్రకాశ్ రెడ్డి ఇటీవల విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో జయప్రకాశ్‌రెడ్డి ఏకపాత్రాభినయం చేస్తూ అలెగ్జాండర్ (ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్) పేరుతో ఇటీవల ఓ సినిమాను కూడా నిర్మించారు. జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని నివాళులు అర్పిస్తున్నారు.