ఉమ్మడి ఏపీ సహా.. ప్రస్తుత నవ్యాంధ్ర వరకు ఎంతో మంది సీఎంలు ప్రజలను పాలించారు. వీరిలో ఎన్టీఆర్ నుంచి కాంగ్రెస్ నేతల వరకు కూడా అనేక మంది ఉన్నారు. కానీ, ఎవరిలోనూ లేని ప్రత్యేకత, ఎవరిలోనూ లేని ఓ శైలి.. మాత్రం తాజా మాజీ సీఎం, నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబులోనే ఉందనేది మేధావుల మాట. సహజంగా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ.. ప్రజల నాడిని పట్టుకుంటారు. వారికి అనుకూలంగా పథకాలు, కార్యక్రమాలు, సంక్షేమాన్ని అమలు చేస్తారు. ఇది ఎవరైనా చేసే పనే. కానీ, దీనికి భిన్నమైన శైలిలో ముందుకు సాగిన ఏకైన ముఖ్యమంత్రి చంద్రబాబు.
సహజంగానే ప్రబుత్వం చేసే పనులపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. అదే సమయంలో ప్రభుత్వంపై బురదజల్లేందుకు కూడా ప్రయత్నిస్తాయి. వీటిని సాధారణంగా సర్కారును నడిపిస్తున్న నాయకులు ఎవరూ పట్టించుకోరు. ప్రతిపక్షాలు కాబట్టి.. అలా దుమ్మెత్తి పోస్తున్నాయని.. తమ పాలన ప్రజారంజకంగా ఉంది కాబట్టే.. ఇలా చేస్తున్నారని.. అని సరిపెడతారు. ఇంతకు మించి ఎవరూ ముందుకు సాగరు. అయితే, దీనికి భిన్నంగా చంద్రబాబు వ్యవహరించి.. తన శైలిని నిరూపించుకున్నారు. సీఎంగా ఉండి.. పాలనతో బిజీగా ఉన్నప్పటికీ..ఆయన వారానికి నాలుగు రోజులు ఖచ్చితంగా ప్రజలతో మమేకమయ్యేవారు.
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై తానే స్వయంగా సమాధానం చెప్పిన సంఘటనలు.. ఇప్పటి వరకు జగన్‌తో సహా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అంతేకాదు, ఆయా అంశాలకు ఆయన వివరణ కూడా ఇచ్చేవారు. నిజానికి ఇది పాలనలో పాదర్శకతగానే భావించాల్సి ఉంటుంది. అయితే, అప్పట్లో చంద్రబాబు చేసిన ఈ ప్రయోగానికి కూడా తోకలు అంటించారు. ఆయన భయపడుతున్నారని, అందుకే వివరణలు ఇచ్చుకుంటున్నారని పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం ప్రారంబించారు. అయినప్పటికీ కూడా బాబు వెనుకడుగు వేయలేదు. తన సర్కారుపై ప్రతిపక్షం చేసిన ప్రతి విమర్శకూ ఆయన సమాధానం చెప్పారు.
ఇది నిజంగా అనుభవం ఉన్న రాజకీయ నేతగా చంద్రబాబుకు మాత్రమే చెల్లిందని చెప్పాలి. ఇక, ఈ క్రమంలోనే బాబు సాధించిన మరో రికార్డు.. తనకు ఎదురైన వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడం, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడం. నిజానికి చిన్న ఎదరు దెబ్బతగిలితే.. ప్రభుత్వం పెద్దగా అల్లాడి పోతుంది. కానీ, బాబు మాత్రం ఇలాంటి వ్యతిరేకతలను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అదేసమయంలో తన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రజల్లో సంతృప్తి రేటును కూడా తెలుసుకుంటూ.. విదానాలు మార్చుకుంటూ ముందుకు సాగిన ఏకైక సీఎంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారనడంలో సందేహం లేదు.