దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు పదవీ గండం పొంచి ఉందా ? ఆయనను ఇంటికి పంపించేలా పరిస్థితులు మారుతున్నాయా ? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కొన్నాళ్లుగా రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వానికి సంకటపరిస్థితిలోకి నెడుతున్నాయి. నిజానికి మంత్రిగా వాటిని పరిశీలించి.. అదుపు చేయాల్సిన వెలంపల్లి ఆ దిశగా చర్యలు తీసుకోలేక పోతున్నారనే వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు తాజాగా ఆయన ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న కనకదుర్గ ఆలయంలో వెండి సింహాల ప్రతిమలు మాయం కావడం ఇప్పుడు మరింత ఉద్రిక్తతకు కారణంగా మారింది.
అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటన సమయంలోనే వెలంపల్లిపై జగన్ సీరియస్ అయ్యారనే వ్యాఖ్యలు వినిపించాయి. అప్పటి కప్పుడు అంతర్వేదికి వెళ్లి పరిశీలించి రావాలని.. చర్యలు తీసుకోవాలని కూడా సీఎంవో నుంచి మంత్రికి ఆదేశాలు వచ్చాయి. దీంతో హుటాహుటిన వెలంపల్లి అక్కడకు వెల్లారు. అయితే, అక్కడ ఆయనకు తీవ్ర వ్యతిరేకత కనిపించింది. దీంతో పోలీసుల సాయంతో అక్కడి పరిస్థితులను సమీక్షించి వచ్చారు. ఇక, ఇప్పడు ఇంటి వద్దే దుర్గమ్మ ఆలయంలో జరిగిన ఘటన మరింతగా ఆయనపై విమర్శలకు అవకాశం ఇస్తోంది.
రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆదాయం వచ్చే ఆలయం, భక్తులు ఎక్కువగా వచ్చే ఆలయం దుర్గగుడే. అలాంటి ఆలయంలో వెండి సింహాలు అదృశ్యం అయిన ఘటనను పైకి చెప్పకపోయినా.. ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యంగా బీజేపీనుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కట్టడిచేయలేక పోతోంది. మరోవైపు టీడీపీ కూడా ఈ సంఘటనలపై ఎప్పటికప్పుడు తీవ్రమైన విమర్శలు చేస్తుండడంతో అవి బలంగా ప్రజల్లోకి వెళుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థతిలో మంత్రిని తప్పిస్తేనే తప్ప ఈ వ్యతిరేకత తగ్గదనే అబిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి పెట్టారని అంటున్నారు. ఇదే జరిగితే.. జగన్ కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.