శాండల్‌వుడ్ డ్రగ్ ఇష్యూలో తీగ లాగుతున్న కొద్ది అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్లు సంజన, రాగిణితో పాటు మొత్తం 25 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడిగా ఉన్న ఆదిత్య ఆళ్వా నివాసంపై బెంగళూరు సీసీబీ పోలీసులు మంగళవారం మెరుపుదాడులు నిర్వహించారు. కోర్టు ఆదేశాలతో జరిగిన ఈ దాడుల్లో భారీగా నిషేధిత మాదకద్రవ్యాలు, పలు కీలక డాక్యుమెంట్లు లభించాయి.
ఈ విషయాన్ని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ చెప్పారు. కర్నాటక మాజీ మంత్రి జీవరాజ్ ఆళ్వా కుమారుడు అయిన ఆదిత్య ఆళ్లాకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కుటుంబంత సంబంధాలు ఉన్నాయి. వివేక్‌కు ఆయన సమీప బంధువేనట. ఆదిత్య ఇంట్లో వీకెండ్ పార్టీల్లో భాగంగా పలువురు సెలబ్రిటీలు వచ్చేవారని.. హీరోయిన్ సంజనా ప్రియుడు రవిశంకర్ ఇచ్చిన సమాచారంతోనే ఈ సోదాలు జరిగాయంటున్నారు.
ఇక డ్రగ్స్ ఉదంతంలో ఆదిత్య పేరు బయటకు వచ్చినప్పటి నుంచి అతడు ఢిల్లీ లేదా ముంబైలో తలదాచుకుని ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ కేసులో అరెస్టు అయిన హీరోయిన్ రాగిణి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో అసహనంతో కాలం వెళ్లదీస్తుండగా.. ఆమె న్యాయవాదులు బె యిల్ కోసం తాజాగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక సంజనను ఇంకా విచారిస్తూనే ఉన్నారు.