నిన్నటి తరం మేటినటీమని సీత మృతి చెందారు. ఆమె వయస్సు 87 సంవత్సరాలు. ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందారు. ఆమె పాత తరం మేటి నటుడు నాగభూషణంకు రెండో భార్య. సీత దేవదాసు, మాయాబజార్ లాంటి ఎన్నో మరపురాని సినిమాల్లో నటించారు. సీతకు ఇండస్ట్రీలో నాగభూషణం సీతగానే పేరుంది. వీరిద్దరు కలిసి ముందు ఓ డ్రామా ట్రూపు నడిపేవారు. అయితే అప్పటికే నాగభూషణంకు పెళ్లి అయినా కూడా ఆమెను రెండో వివాహం చేసుకున్నారు.
సీత అసలు పేరు పొట్నూరి సీతాదేవి. ఆమె 1933 అక్టోబర్ 14న కాకినాడలో జన్మించారు. సీత బంధువు ఆమెను దత్త పుత్రికగా కాకినాడ నుంచి మద్రాస్‌కు తీసుకు వెళ్లారు. అక్కడే ఆమెకు డ్యాన్స్ పట్ల ఆసక్తి ఏర్పడింది. కెవి. రెడ్డి దర్శకత్వం వహించిన యోగి వేమన సినిమాలో ఆమె బాలనటిగా నటించారు. ఆ తర్వాత యాయా బజార్, గుణసుందరి కథ, పెద్ద మనుష్యులు సినిమాల్లో ఆమె నటించింది. ఆమె చివరి చిత్రం 2002లో వచ్చిన నేనేరా పోలీస్.
250 సినిమాల్లో నటించిన సీత బుల్లితెరపై కూడా మెరిశారు. ఆమె నటించిన తొలి సీరియల్ రుతురాగాలు. నాగభూషణంను ఆమె 1956లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కూతురు భువనేశ్వరి, కొడుకు సురేందర్ సంతానం.