దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజుకు సగటున 95 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,06,615 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 96,424 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక తాజా కేసులతో దేశం మొత్తం మీద కేసుల సంఖ్య 52 లక్షలకు చేరుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నా రికవరీ కూడా అంతే స్థాయిలో ఉండడం మాత్రం కాస్త ఊరటనిస్తోంది.
ఇప్పటికే కరోనా నుంచి 41 లక్షల మంది కోలుకోగా… నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 87 వేల మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒక్కరోజు వ్యవధిలో ఇంతమంది కోలుకోవడం ఇదే తొలిసారి. ఇక దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.86 శాతానికి చేరుకోగా… మరణాల రేటు 1.62 శాతంగా ఉంది. దేశంలో ఉన్న క్రియాశీల కేసుల్లో దాదాపు 60శాతానికి పైగా కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.