భారత్ – చైనా మధ్య సరిహద్దు ప్రాంతంలో గాల్వాన్ లోయలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. ఇక గత జూన్ 15న గాల్వాన్ లోయలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పాటు చైనా దళాలు కవ్వింపు చర్చలతో 20 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలోనే 60 మందికి పైగా చైనా సైనికులు కూడా మృతి చెందారని.. అమెరికాకు చెందిన న్యూస్ వీక్ వార్తా పత్రిక సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తమ సైనికులు 60 మంది మృతి చెందడంతో ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ దీనిని తీవ్ర అవమానంగా భావిస్తున్నారని కూడా ఆ కథనం పేర్కొంది. ఈ ఘటన తర్వాత కూడా చైనా సైన్యం మరో దూకుడు చర్యకు సిద్ధమైందట. ఇక గాల్వాన్ ఘర్షణలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు మృతి చెందిన విషయాన్ని భారత ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.
అయితే చైనా పీఎల్ఏ మాత్రం తమ దేశానికి చెందిన 60 మంది సైనికులు చనిపోతే మాత్రం ఎందుకు వెల్లడించలేదు.. ఇక్కడే అనేక సందేహాలు తలెత్తుతున్నాయని న్యూస్ వీక్ ప్రశ్నించింది. ఇక చైనా చర్యలతో 50 ఏళ్ల తర్వాత భారత్ తన దూకుడు ప్రదర్శించిందని కూడా న్యూస్ వీక్ పేర్కొంది.