ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీకి వరుసగా కోర్టుల నుంచి మొట్టికాయలు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గతంలో కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖకు సంబంధించి సీఐడి నిర్వహిస్తోన్న విచారణపై అమరావతి హైకోర్టు స్టే విధించింది. ఇది ప్రభుత్వానికి పెద్ద షాకే. ఇక నాడు రమేష్‌కుమార్ రాసిన లేఖ ఆయన రాయలేదని.. ఇతరులు తయారు చేయించిన లేఖను ఆయన పంపారని వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే సీఐడీ విచారణలో కొందరిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. కేసులు పెట్టడంతో ఉద్యోగులు తమ విధులు సరిగా నిర్వర్తించలేకపోతున్నారంటూ ఎస్‌ఈసీ రమేష్ కుమార్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు ఎన్నికల సంఘం ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. ఇక విచారణ ఎవరిపై ఎందుకు చేస్తున్నారో ? వివరాలు ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఇది కూడా వరుస దెబ్బల్లో జగన్ సర్కార్‌కు మరో ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.