నైరుతి రుతుపవనాల ప్రభావంలో కర్నాకటలో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. రాజధాని బెంగళూరు నగరంలో బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. అనేక ప్రాంతాల్లో ఏకంగా 45 నుంచి 85 మిల్లీమీటర్ల వర్షపాతం సంభవించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత మూడు రోజులుగా కురుస్తోన్న కుంభవృష్టికి నగరంలో 40 వార్డులు చాలా వరకు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లు మురికి గుంతలను తలపిస్తున్నాయి.
నాయండహళ్లి సమీపంలో రాజకాలువ అడ్డుగోడ కొట్టుకుపోవడంతో ప్రమోద్ లేఔట్‌లో 25కు పైగా ఇళ్లలోకి మురుగునీరు వచ్చేసింది. పలు అపార్టమెంట్లలో సెల్లార్లలో వందలాది వాహనాలు నీటమునిగాయి. చిత్రదుర్గ జిల్లాలో ఓ ట్రాక్టర్ కొట్టుకుపోగా నలుగురు ప్రాణాలతో సేఫ్ అయ్యారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో 5 అడుగులకు పైగా నీరు నిలిచిపోవడంతో ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు వంటి విలువైన సామగ్రి నాశనమైంది.
కొన్ని చోట్ల అండర్ పాస్‌లు మునిగిపోయాయి. మాగడి రోడ్డు, విజయనగర, అగ్రహార దాసరహళ్లి, హెబ్బాల, మూడలపాళ్య, హెణ్ణూరు, హొరమావు, హుళిమావు, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ ప్రాంతాల్లో వర్షబీభత్సం అధికంగా ఉంది. మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్‌ను ప్రకటించింది.