కన్నడ సినీ ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. కర్నాటక డ్రగ్స్ మాఫియా కేసులో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్టు కావడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. వీరితో పాటు ఈ కేసులోనే బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు మరో 12 మందిని కూడా అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని తిరస్కరించడంతో కస్టడీకి తరలించారు. ఇక హీరోయిన్లు సంజన, రాగిణిని విచారిస్తోన్న క్రమంలోనే అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
సామాజిక కార్యకర్త వ్యాపారవేత్త ప్రశాంత్ సంబర్గి పోలీసుల విచారణలో బాలీవుడ్ నటులు పలువురు సినీ సెలబ్రిటీల పేర్లను కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది. శ్రీలంకలో జరిగిన ఓ పార్టీకి హీరోయిన్ సంజన గల్రానీ వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ ఆహ్మద్ ఖాన్ కూడా వచ్చారని ప్రశాంత్ చెప్పినట్టు బెంగళూరు మిర్రర్ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తలను ఎమ్మెల్యే ఖండిస్తున్నారు. తనకు సంజన ఎవరో తెలియదంటున్నారు.
ఆమె నటించిన సినిమాలు కూడా ఇంత వరకు చూడలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారని తెలుస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే చమ్రాజ్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏదేమైనా శాండల్‌వుడ్ డ్రగ్స్ ఇష్యూలో రోజుకో కొత్త మలుపు వెలుగులోకి వస్తోంది.