ముంబైలో కర్ణిక ఆఫీస్‌లో కొంత భాగం కూల్చేయడంతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగన రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరన్న ఆమె బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చిన కంగనా శివసేనను ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించారో ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారని తీవ్రంగా విమర్శించారు. శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారని ఎద్దేవా చేశారు.
ఇక కంగనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని మహారాష్ట్ర గవర్నర్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇక కంగనాతో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలె ముంబైలో సమావేశమయ్యారు. బీజేపీ మిత్రపక్షమైన అథావలె పార్టీ ఆర్‌పీఐ(ఏ) కంగనకు మద్దతుగా నిల్చిన విషయం తెలిసిందే. ఇక కంగనా విషయంలో శివసేన వ్యవహరించిన తీరుపై మిత్రపక్షం ఎన్సీపీ అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఉద్దవ్‌కు ఎన్సీపీ అధినేత పవార్‌కు మధ్య చిన్నపాటి పొరాపొచ్చలు కూడా వచ్చాయంటున్నారు.