భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 49,30,236కు చేరింది. వీరిలో ఇప్పటికే 38లక్షల మంది కోలుకోగా మరో 10 లక్షల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక అనధికారిక లెక్కల ప్రకారం చూస్తే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువుగా ఉండనుంది. ఇక కరోనా మరణాలు దేశంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే మొత్తం 1054 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 80 వేలు దాటేసింది.
అయితే కోవిడ్‌తో మరణిస్తోన్న వారిలో దాదాపు 70 శాతం మంది ఉబ్బసం, శ్వాసకోస, కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారే అని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78శాతానికి చేరడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. ఇక ఇప్పటి వరకు దేశంలో 5.83 కోట్ల శాంపుల్స్ ఉపయోగించి పరీక్షలు చేశారు. కరోనా మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, బ్రెజిల్, భారత్‌లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.