ఏపీలో అధికార వైసీపీలో ముసలం మొదలైందా ? నిన్న మొన్నటి వరకు సీఎం జగన్ వర్సెస్ ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మధ్య కోల్డ్ వార్ ఉందన్న ప్రచారం ఇప్పుడు నిజమవుతోందా ? విజయసాయి అభీష్టానికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరించడమే ఇందుకు కారణమా ? అంటే అవుననే చర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక కొద్ది రోజులుగా ఉన్న ఊగిసలాటకు తెరపడింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది.
ఈ నెల 16వ తేదీన ఆయన వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా గంటా వైసీపీ కండువా కప్పుకోకపోయినా జగన్‌ను కలుస్తారు.. అక్కడే గంటా కుమారుడు.. ఆయన సన్నిహితులు వైసీపీలో చేరతారు. ఇప్పటి వరకు వైసీపీకి దగ్గరైన టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో ఏవిధంగా ఫాలో అయ్యారో ఇప్పుడు గంటా విషయంలోనూ అదే జరుగుతుందట. అయితే గంటాను పార్టీలో చేర్చుకోవడం ముందు నుంచి విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ విజయసాయిరెడ్డికి ఏ మాత్రం ఇష్టంలేదు.
గంటా పార్టీలోకి వస్తే తమ ప్రాభవానికి ఎక్కడ గండి పడుతుందో ? అని భావిస్తోన్న ఈ ఇద్దరు ముందు నుంచి గంటా పార్టీ ఎంట్రీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే అవంతి, విజయసాయి వల్ల విశాఖలో పార్టీ బలపడలేదని.. రేపు అక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ ఓడిపోతుందని భావించిన జగన్ చివరకు వేరే రూట్లో గంటాను పార్టీలోకి లాగేసుకున్నారు. ఇక ఇప్పుడు విశాఖలో మళ్లీ గంటా హవా మొదలైతే విజయసాయి, అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రాభావం తగ్గడం ఖాయం.
అందుకే విజయసాయితో పాటు అవంతి గంటా పార్టీ ఎంట్రీపై ఓపెన్‌గానే విమర్శలు చేస్తున్నారు. నిన్న అవంతి సైతం గంటా కేసులు తప్పించుకోవడానికే పార్టీ మారుతున్నారంటూ విమర్శించారు. ఇక ఇదే విషయంలో ఇప్పటికే ఉన్న గ్యాప్ విజయసాయి వర్సెస్ జగన్ మధ్య మరింత ముదురుతోందన్న టాక్ కూడా వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది.