ఏపీ రోజు రోజుకు అప్పుల కుప్పగా మారిపోతోంది. గత ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి, సంక్షేమం, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్లింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలు, సంక్షేమం పేరిట ఇష్టమొచ్చినట్టు డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. అసలే ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అప్పులతోనే ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది. చివరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యంగా చెల్లించే పరిస్థితి వచ్చింది.
ఓ వైపు ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ టైంలో జగన్ సర్కార్ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతోంది. ఇక కరోనా నేపథ్యంతో పాటు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంవల్ల ఆదాయం లేకపోవడంతో అప్పులే గతి అవుతున్నాయి. చివరకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కూడా అప్పులే చేస్తున్నారు. కొత్త అప్పు కోసం ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3శాతం నుంచి 5 శాతంకు పెంచుతూ చట్ట సవరణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
మంత్రులు సంతకాలు చేసి గవర్నర్ ఆర్డినెన్స్ కోసం కూడా పంపారని తెలుస్తోంది. ఇక ఈ యేడాది మూడు నెలల్లోనే ఏపీ ఏకంగా రూ.33294 కోట్లను అప్పుల రూపంలో సమీకరించిందని కాగ్ లెక్కలు వెల్లడించాయి. ఈ ఏడాది మొత్తం రుణ లక్ష్యంలో ఇది 68 శాతం కావడం గమనార్హం. అంటే 12 నెలల రుణంలో మూడు నెలలకే 68 శాతం అప్పు చేసేశారు. మరి ఈ లెక్కన వచ్చే 9 నెలల్లో ఇంకెతం అప్పు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా ప్రణాళికా బద్ధమైన ప్లానింగ్ లేని పాలన వల్ల ఏపీ రోజు రోజుకు అప్పుల కుప్పగా మారిపోతోంది.