అనంతపురం జిల్లా….టీడీపీకి కంచుకోట. రాయలసీమలో మిగతా జిల్లాలతో పోలిస్తే టీడీపీకి ఎక్కువ బలం ఉన్న జిల్లా అనంతనే. ఆఖరికి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైతం టీడీపీకి పట్టు తక్కువే. కానీ అనంతలో టీడీపీకి ఉన్న బలం అంతా ఇంతా కాదు. టీడీపీ ఆవిర్భావం నుంచి అనంత జిల్లా ఆ పార్టీకి పెట్టని కోట. 2014 ఎన్నికల్లో సైతం అనంతలో టీడీపీ తిరుగులేని విజయం అందుకుంది. మిగతా మూడు జిల్లాల్లో వైసీపీ హవా నడిచిన, అనంతలో టీడీపీ జెండా ఎగిరింది. అనంతపురంలో మొత్తం 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు ఉండగా, టీడీపీ 12 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. ఇక 2 అసెంబ్లీ సీట్లని మాత్రం స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
అయితే ఇలా కంచుకోటగా ఉన్న అనంతలో 2019 ఎన్నికల్లో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ ఉండటంతో, ఇక్కడ టీడీపీ చతికిలపడింది. వైసీపీ 12 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే, టీడీపీ కేవలం హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో గెలిచింది. హిందూపురంలో బాలయ్య వరుసగా రెండోసారి విజయం సాధించగా.. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. అయితే ఎన్నికలై ఏడాది దాటింది. ఈ ఏడాది సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత కావొచ్చు, స్థానిక టీడీపీ నేతల పనితీరు కావొచ్చు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలం పుంజుకుంది.
సిట్టింగ్ స్థానలైనా హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగానే ఉంది. ఇక వైసీపీ సిట్టింగ్ స్థానాల్లో టీడీపీ బాగా బలం పుంజుకున్న నియోజకవర్గం కదిరి. ఇక్కడ టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్‌కు ప్రజల మద్ధతు పెరిగింది. కదిరి తర్వాత తాడిపత్రిలో సైతం టీడీపీకి పట్టు దొరికింది. ఇక్కడ జేసీ ఫ్యామిలీ హవా మళ్ళీ మొదలైంది. అటు రాయదుర్గం, గుంతకల్, పెనుకొండ, రాప్తాడు, మడకశిర నియోజకవర్గాల్లో టీడీపీకి బలం పెరిగిందని తెలుస్తోంది.