షాకింగ్: ఏపీలో బీజేపీ ఇలా అధికారంలోకి వచ్చేస్తుందా… కామెడీ లెక్క‌లివే…!

2019 ఎన్నికల్లో దేశమంతా మోదీ హవా నడిచినా…ఏపీలో మాత్రం కమలం వికసించలేదు. అసలు ఘోరంగా ఆ పార్టీకి ఒక శాతం కూడా ఓట్లు రాలేదు. ఇక 50 శాతంపైనే ఓట్లతో వైసీపీ అధికారంలోకి వస్తే, 40 శాతం ఓట్లతో టీడీపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. అటు జనసేన 6-7 శాతం ఓట్లు దక్కించుకుంది. ఇక బీజేపీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా సరే, ఏపీలో బీజేపీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. కేంద్రంలో అధికారంలో ఉండేసరికి ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే విధంగా ముందుకెళుతుంది. అందులో భాగంగానే బాగా బలంగా ఉన్న ప్రతిపక్ష టీడీపీని దెబ్బకొట్టి, బీజేపీ బలపడాలని చూస్తోంది.

 

అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు టీడీపీ నేతలనీ బీజేపీలో చేర్చుకున్నారు. ఇక తర్వాత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని, నెక్స్ట్ ఎలాగైనా ఏపీలో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. అయితే కొత్తగా అధ్యక్ష స్థానంలోకి వచ్చిన సోము వీర్రాజు సైతం, 2024లో జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కొన్ని లెక్కలు కూడా చెబుతున్నారు. జనసేనకు ఉన్న 18 శాతం ఓట్లు, బీజేపీకి ఉన్న 7 శాతం ఓట్లు భవిష్యత్‌లో బాగా ఉపయోగపడతాయని మాట్లాడుతున్నారు.

 

ఇక మరికొందరు బీజేపీ నేతలైతే టీడీపీ నుంచి 20 శాతం, వైసీపీ నుంచి 20 శాతం ఓట్లు లాగేసుకుని అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్నారు. అసలు మొన్న ఎన్నికల్లో బీజేపీకి ఒకశాతం ఓట్లు కూడా రాలేదు. అటు జనసేనకు 7 శాతం వరకు వచ్చాయి. మొత్తం కలిపి చూసుకున్న ఒక 8 శాతం వరకు ఉంటాయి. అలాంటిది జనసేనకు 18, బీజేపీకి 7 శాతం ఓట్లు ఎక్కడ నుంచి వచ్చాయో వీర్రాజుకే తెలియాలి. ఇక టీడీపీ నుంచి 20, వైసీపీ నుంచి 20 శాతం ఓట్లు లాగేసుకుని బీజేపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదు.

Leave a comment