విశాఖలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పెత్తనంతో మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోతున్నారంటూ కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తల సంగతి ఇలా ఉంటే తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ మంత్రి అవంతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ తీసుకువచ్చిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి అవంతి చేతకాని తనంతో ఏపీ టూరిజం పాలసి ఎటూ కాకుండా పోయిందని ఆయన మండిపడ్డారు.
టీడీపీ పాలనలో విశాఖలోని ఆనంగంపూడిలో 150 ఎకరాలు కేటాయిస్తే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసినా కూడా విశాఖ వాసిగా ఉన్న మంత్రి అవంతి నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. విశాఖలో అధికారాలు అన్నింటిని జగన్ విజయసాయికి కట్టబెట్టడంతో అవంతి ఈవెంట్ మేనేజర్‌గా మారారని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇక విశాఖలో భూకబ్జాలలో విజయసాయి, మంత్రి అవంతి పోటీ పడుతున్నారని కూడా ఎమ్మెల్సీ సత్యనారాయణ విమర్శించారు. వీరు భూకబ్జాలు చేసుకుంటూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్నారని.. అందుకే మొన్న విశాఖ నేత కొయ్య ప్రసాదరెడ్డి భూకబ్జాలు బయటకు వచ్చాయని ఆయన విమర్శించారు.