బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఆయన మృతి విషయంలో జరుగుతోన్న ఇన్వెస్ట్‌గేషన్‌లో ఏ చిన్న అంశం అయినా దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతూనే ఉంది. తాజాగా సుశాంత్ బ్యాంక్ ఖాతాలోని రు. 50 కోట్లు ఏమయ్యాయని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే కొత్త సందేహం లేవనెత్తారు. సుశాంత్ మృతిపై విచారణ చేస్తోన్న ముంబై పోలీసులు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని.. వేగంగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇక గత నాలుగేళ్లలో సుశాంత్ ఖాతా నుంచి ఏకంగా రు. 50 కోట్లు క్రెడిట్ అయ్యాయని.. అయితే ఈ మొత్తం విత్ డ్రా అవ్వడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఒక ఏడాదిలో ఆయన ఖాతాకు 17 కోట్లు జమ కాగా.. ఈ మొత్తంలో 15 కోట్లు విత్ డ్రా అయ్యాయి. ఇది దర్యాప్తులో కీలక విషయం కాదా అన్నారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై తాము ముంబై పోలీసులను ప్రశ్నిస్తామని, మౌనంగా ఉండబోమని అన్నారు. ఇక తమ పోలీస్ శాఖకు చెందిన అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్‌కు తరలించడం కూడా ఆయన తప్పుపట్టారు. ఏదేమైనా సుశాంత్ కేసులో రోజుకో సరికొత్త సందేహాలు తలెత్తుతున్నాయి.