భారత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషయంలో కొద్ది రోజుల నుంచి ఆందోళనకర వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కరోనాకు గురైన ఆయన ఆ తర్వాత కరోనా నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నారు. బాలు భార్య సైతం కరోనాకు గురయ్యారు. చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన ఆరోగ్యం గురించి ఆయన సోదరి ఎస్పీ శైలజ తాజా ప్రకటన చేశారు.
అన్నయ్య బాలు గారి ఆరోగ్యం ఇప్పుడు ముందు కంటే మెరుగయ్యిందని శైలజ చెప్పారు. అలాగే ప్రస్తుతం వెంటిలేటర్ కూడా తీసేశారని.. ఆయన ఆరోగ్యం పట్ల ఆసుపత్రి వైద్యులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారని.. ప్రతి ఒక్కరు అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు చేస్తోన్న విషయం మాకు తెలుసని.. మీ అందరి ప్రార్థనలతో అన్నయ్య కోలుకొని తిరిగి వస్తారంటూనే ఆమె అందరికి ధన్యవాదాలు తెలిపారు.