మనం నగదు కావాలంటే ఏటీఎంకు వెళ్లి ఏటీఎం కార్డు వేసి నగదు డ్రా చేసుకుంటాం… అయితే ఇప్పుడు ఏటీఎం తరహాలో బియ్యం కోసం కూడా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని కన్నడ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇలాంటి విధానం ఇప్పటి వరకు ఇండోనేషియా, వియత్నాం దేశాల్లో మాత్రమే అమల్లో ఉంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వినియోగదారులు క్యూలో నిల్చోకుండా ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఈ బియ్యం సెంటర్లపై తీవ్ర అధ్యయనం చేస్తోంది కన్నడ ప్రభుత్వం. ఈ విధానం ప్రజలకు ఎలా అందుబాటులోకి తీసుకు రావాలన్నదానిపై సమాలోచనలు చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి కె.గోపాలయ్య చెప్పారు. ఇక ప్రస్తుతం బీపీఎల్ కార్డు కలిగిన వారికి ఉచితంగా, ఏపీఎల్ కార్డు కలిగిన వారికి నిర్ధిష్ట మొత్తంలో నగదు చెల్లించి బియ్యం, పప్పులు పొందే పథకం ఇప్పుడు అమలు అవుతోంది.
అయితే సరుకుల కోసం రేషన్ దుకాణాలకు వెళ్లి.. అవి తెరిచే వరకు గంటల కొద్ది క్యూలో ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు కరోనా సమయంలో ప్రజలు క్యూలో ఉండేందుకు, ఇతర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. వీటికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఈ బియ్యం సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.