తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పార్టీ గెలిచింది. పార్టీ ఓడిపోయిన రెండు నియోజకవర్గాల్లో కూడా గణనీయమైన ఓట్లు వచ్చాయి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోయినా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మాత్రం టీడీపీ తన అభ్యర్థిగా చావా కిరణ్మయిని పోటీలో దింపింది. ఇక ఇప్పుడు త్వరలోనే తెలంగాణలో జరిగే మరో ఉప ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుందని సమాచారం.
పార్టీ గెలపు ఓటముల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో టీడీపీకి క్షేత్రస్థాయిలో బలం తెలుసుకునేందుకు ఈ ఉప ఎన్నిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పార్టీ తెలంగాణ నేతలు సైతం ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారట. ఇటీవల సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. ఆ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేరు పరిశీలనలో ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీ నుంచి అభ్యర్థిగా ఇల్లెందుల రమేష్ గుప్తాని పార్టీ పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో దుబ్బాక టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. దీంతో ఇప్పుడు ఆయన్ను దుబ్బాక నుంచి బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం దాదాపు నిర్ణయం తీసుకుందంటున్నారు. గతంలో ఇక్కడ పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేశారు.
ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్ ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో చతికిలపడింది. టీఆర్ఎస్‌పై కేవలం ఐదు నెలల్లోనే వ్యతిరకత వ్యక్తమైంది. ఇప్పుడు కూడా ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని భావిస్తోన్న ప్రతిపక్ష పార్టీలు దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాయి. మరి తెలుగుదేశం ఈ ఎన్నికల్లో అంచనాలకు మించి ఓట్లు తెచ్చుకున్నా గొప్ప విషయమే.