విశాఖపట్నంలోని పెందుర్తిలో ఓ దళిత యువకుడు అయిన కర్రి శ్రీకాంత్‌కు శిరోముండనం జరిగిన అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. కమెడియన్, ఆర్జీవీపై వ్యతిరేకంగా తెరకెక్కించిన పరాన్నజీవి దర్శకుడు అయిన నూతన్ నాయుడు భార్య మధుప్రియ తన ఇంట్లో పనిచేసిన మానేసిన శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్ దొంగిలించాడంటూ అభియోగం మోపడంతో పాటు అతడికి స్థానిక సెలూన్ షాప్ నిర్వాహకుడిని పిలిపించి శిరోముండనం చేయించిన సంగతి తెలిసిందే.
దీనిపై సీసీటీవీ ఫుటేజ్‌లో ఆధారాలు ఉండడంతో అందరూ అడ్డంగా దొరికిపోయారు. దీంతో నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిని పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే నిందితులను విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు వ్యవహారంలో నూతన్‌నాయుడుపై కూడా అతడి పాత్ర ఎంత వరకు ఉందనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
పోలీసులు రిమాండ్ విధించిన వెంటనే జ్యుడీషియల్ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు మధుప్రియ అనారోగ్యం అంటూ నాటకం ఆడారు. అయితే కేజీహెచ్ వైద్య పరీక్షల్లో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.