భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. బుధవారం విడుదల అయిన ర్యాంకుల్లో వీరిద్దరు వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. కోహ్లి 871 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ 855 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచాడు. ఇలా టాప్ స్థానం కోసం ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్స్ పోటీపడడం ఆసక్తిగా మారింది. ఇక వీరి తర్వాత బాబర్ ఆజమ్, రాస్ టేలర్, డుప్లిపెస్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టుల్లో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 911 పాయింట్లతో తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా… విరాట్ కోహ్లి (886 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నారు.
ఇక టీ 20ల్లో భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ రెండో ర్యాంకులో ఉన్నాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంకును, ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. బౌలింగ్‌లో టెస్టుల్లో కమిన్స్ (ఆస్ట్రేలియా, 904 పాయింట్లు), వన్డేల్లో ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, 722 పాయింట్లు), టి20ల్లో రషీద్ ఖాన్ (736 పాయింట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. 719 పాయింట్లతో భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వన్డేల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.