తెలంగాణ బీజేపీలో ముసలం మొదలైంది. కేంద్ర నాయకత్వం కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన దూకుడుగా ముందుకు వెళుతున్నారు. సంజయ్ కొందరు సీనియర్ నేతలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అప్పటి నుంచి తెలంగాణ బీజేపీలో చాపకింద నీరులా అసంతృప్తి కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర కమిటీ ప్రకటనతో కమలంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంటోది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలో ఎవ్వరికి చోటు లేదు. ఇక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్గానికి ఎక్కువ పదవులు రాగా.. లక్ష్మణ్ వర్గాన్ని అస్సలు పట్టించుకోలేదంటున్నారు.
ఇక బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి అస్సలు పదవులే రాలేదని అంటున్నారు. ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలకు తప్ప మిగిలిన ఎవ్వరికి పదవులు లేవంటున్నారు. ఇక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి కూడా తన వర్గానికి బాగానే పదవులు ఇప్పించుకున్నాడని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉపాధ్యక్షుల్లో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేలే. అధికార ప్రతినిధులుగా కేవలం ముగ్గురికి మాత్రమే చోటు కల్పించారు. దీంతో పదవులపై ఆశలు పెట్టుకున్న మిగిలిన నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
లక్ష్మణ్ టైమ్‌లో వెలుగు వెలిగిన వారిని ఈ సారి పక్కన పెట్టేశారు. మొత్తానికి బండి సంజయ్ రాష్ట్ర కమిటీలో తన మార్క్‌ను చూపించారన్న ప్రచారం అయితే జరుగుతోంది. అయితే అదే టైంలో పదవులు ఆశించి భంగపడ్డ వారు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేసే ఏర్పాట్లలో ఉన్నారట. బండి సంజయ్ సీనియర్లను జూనియర్లను సమన్వయం చేసుకోలేకపోయారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. మరి ఈ బడబాగ్ని ఎలా చల్లారుతుందో ? చూడాలి.