భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు శనివారం సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ఆ వెంటనే మరో ఆటగాడు సురేష్ రైనా సైతం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ధోనీ ఆటతీరు గతంలో పోలిస్తే వేగం తగ్గిందన్న కామెంట్లు ఉన్నాయి. ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లలో ధోనీ ఆట చూశాక కూడా పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఇక మరి కొన్నేళ్ల పాటు ధోనీ క్రికెట్లో కొనసాగవచ్చని అనుకుంటోన్న టైంలో ధోనీ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. గత ప్రపంచకప్ తర్వాత ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినా ఐపీఎల్‌లో ధోనీ ఆడతాడనే అందరూ అనుకున్నారు.
ఇప్పుడు ధోనీ సడెన్ రిటైర్మెంట్ వెనక ప్రధాన కారణం టీ 20 ప్రపంచకప్ అయ్యి ఉంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే కరోనా నేపథ్యంలో టీ 20 ప్రపంచకప్ వాయిదా పడింది. ధోనీ టి20 ప్రపంచకప్‌లో ఆడాలని.. ఆ తర్వాత రిటైర్ అవ్వాలని అనుకున్నాడు. అయితే అప్పటికే ధోనీకి 40 ఏళ్లు నిండుతాయి.. ఇప్పటికే వయస్సు పైబడడంతో మునుపటిలా ఆడలేకపోతున్నాడు. ఇక అప్పటి వరకు వేచి ఉండడం కంటే రిటైర్మెంటే సరైన నిర్ణయం అని ధోనీ తప్పుకున్నట్టు తెలుస్తోంది.