మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి తనలో క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా టఫ్ పోటీలో సంక్రాంతికి వచ్చి కూడా ఏకంగా రు.100 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టి చిరు స్టామినా ఏంటో చూపించింది. ఇక సైరా సినిమాకు భారీ లాభాలు రాకపోయినా ఆ సినిమా కూడా రు.100 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తోన్న చిరు ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
చిరు వరుస సినిమాలు చేయడం ఆయన అభిమానులకు హ్యాపీయే అయినా ఆయన వరుసగా డిజాస్టర్ డైరెక్టర్ల వెంట పడుతుండడం మాత్రం ఆయన అభిమానులకు ఎంత మాత్రం నచ్చడం లేదు. చిరు తాను మెహర్ రమేష్‌తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నానని చెప్పగానే మెగా అభిమానుల గుండెలు జారిపోయాయి. అసలు మెహర్ రమేష్‌ను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ తెలుగు సినిమా హీరో దగ్గరకు రానివ్వడం కాదు కదా.. కనీసం అపాయింట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మెహర్ ఇచ్చిన డిజాస్టర్లు అలాంటివి.
ఇక ఇప్పుడు వినాయక్ పేరు కూడా వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండి ఉన్నట్లుండి చాలా వేగంగా ఫేడవుట్ అయిపోయిన వినాయక్ ఖైదీ నెంబర్ 150 సినిమాను డైరెక్ట్ చేసినా అది రీమేకే. అందులో వినాయక్ ప్రతిభ ప్రత్యేకంగా లేదు. అఖిల్, ఇంటిలిజెంట్ సినిమాలు చూసిన వారు వినాయక్ డైరెక్షన్ మర్చిపోయాడని కూడా కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు లూసీఫర్ రీమేక్ నుంచి సుజిత్ తప్పుకోవడంతో సడెన్‌గా చిరు ఆ ప్లేస్‌లో వినాయక్‌ను తీసుకోవాలని ఆలోచన చేస్తుండడమే మెగా అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. మరి చిరు చివరకు అయినా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడని మెగా అభిమానులు భావిస్తున్నారు.