కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రపంచం అంతా హైదరాబాద్ వైపే చూస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రపంచ మహమ్మారికి వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే అది కూడా భారత్ బయోటెక్ నుంచే వస్తుందని కేటీఆర్ నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే టీకాల తయారీలో హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగిందని చెప్పిన కేటీఆర్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరక్టర్ శక్తి నాగప్పన్ తో కలిసి చర్చను నిర్వహించారు.
ఈ వ్యాక్సిన్ తయారీలో భారత్ బయెటెక్ ముందంజలో ఉండడం గర్వకారణమని కూడా కేటీఆర్ అన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇక్కడే కేటీఆర్‌పై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. వాస్తవానికి వ్యాక్సిన్ క్రెడిట్ ఐసీఎంఆర్‌ది. అంటే సెంటర్‌కే ఆ క్రెడిట్ దక్కాలి.. అయితే హైదరాబాద్‌లో నిమ్స్‌లో ప్రయోగాత్మకంగా ఈ వ్యాక్సిన్ ప్రయోగించారు. వైజాగ్‌లో కింగ్‌జార్జ్ హాస్పటల్లో కూడా ఈ వ్యాక్సిన్పై ట్రయల్స్ జరిగాయి. అలాగని ప్రతి రాష్ట్రం ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోదు. అయితే గియితే ఈ క్రెడిట్ వేసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇది తన ఖాతాలో వేసుకోవచ్చని… అయితే కేటీఆర్ దీనిని తమ ఖాతాలో వేసుకోవడం కరెక్ట్ కాదేమోనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.