ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం ఆగట్లేదు. మనదేశంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే తెలంగాణ, ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంతో మంది ప్రజాప్రతినిధులు సైతం కరోనా భారీన పడ్డారు. వీరిలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మృతిచెందారు. మరి కొందరు కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో మాజీ మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత కరోనా భారీన పడ్డారు.
టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కరోనా సోకింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గత కొద్ది రోజుల నుంచి తనను కలిసిన ప్రజలతో పాటు, పార్టీ కార్యకర్తలు సైతం కరోనా పరీక్షలు చేయించుకోవాలని జూపల్లి సూచించారు.
ఇక తెలంగాణలో ఇప్పటికే బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, గొంగిడి సునీత దంపతులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, సుధీర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులకు కరోనా సోకింది. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే.