కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో కొన్ని జాతులు అంతం కాబోతున్నాయా ? ఈ మహమ్మారి దెబ్బకు కొన్ని ఆదివాసీ జాతులు బతికి బట్టకట్టే పరిస్థితి లేదనే అంటున్నారు ప్రపంచ ఆరోగ్య నిపుణులు. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న నగరాలు.. మహానగరాలు, పట్టణాల్లోనే ప్రజలు చావు నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతుంటే ఇక గ్రామాలు.. పల్లెటూర్లలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ? ప‌్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరి సంగతే ఇలా ఉంటే ఇక ఎక్కడో అడవులు, కొండల్లో ఉండే ఆదివాసీలు, గిరిజన జాతుల పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ? ప‌్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇదే అంశంపై స్పందిస్తూ కరోనా వైరస్ ఆదివాసీ తెగలు జాతులతోపాటు దేశాలనే తుడిచిపెట్టేయగలదని ఐక్యరాజ్యసమితి ఆదివాసీ హక్కుల కమిటీ సభ్యుడు విక్టోరియా టాలీ కార్పజ్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అంతెందుకు 2009లో కెనడాలో సోకిన హెచ్1ఎన్1 వైరస్ ప్రబలి ఆదివాసీ కెనడియన్లు 16శాతం తుడిచిపెట్టుకుపోయారని ఆయన తెలిపారు. ఆదివాసీల్లో అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా పోషకాహార లోపంతో పాటు సరైన వైద్య సదుపాయాలు లేక వీరిలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువుగా ఉంటుంది.
వీరికి ఇంతకుముందే రకరకాల వ్యాధులు సోకి ఉండడంతో వీరికి కరోనా వస్తే బతికే ఛాన్సులు కూడా తక్కువుగా ఉంటాయని కార్పజ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాతుల్లో కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభమైతే వీరు అంతం కావడానికి ఎంతో సమయం పట్టదని కూడా ఆయన చెపుతున్నారు. ముఖ్యంగా ఆమెజాన్ అటవీ ప్రాంతం సహా ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా ప్రబలితే ఆ జాతులే అంతమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.