హైదరాబాద్ హాస్పటల్స్‌లో కోవిడ్ పేరుతో దారుణాలు జరుగుతున్నాయి. ఎవరికి అయినా కరోనా ఉందని వెళితే ఇష్టమొచ్చినట్టు లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సాక్షాత్తూ ఓ డాక్టర్‌ను ఓ ఆసుపత్రి ఎలా ఇబ్బంది పెట్టిందో చూశాం. దీంతో ఆ డాక్టర్ స్వయంగా తన ఆవేదనను వీడియో రూపంలో వదిలారు. ఇక ఇప్పుడు మరో హాస్పటల్ చేసిన దారుణాలు కూడా బయటకు వచ్చాయి. ఈ పరిస్థితి నగరంలో అనేక హాస్పటల్స్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఓ న్యాయవాది జ్వరంగా ఉందని హాస్పటల్‌కు వెళితే సదరు హాస్పటల్ కరోనా లేకుండానే నాలుగు రోజులు వైద్యం చేసి ఏకంగా రు. 3 లక్షల బిల్లు వేసిందట. నగరంలోని విజయ్‌నగర్ కాలనీకి చెందిన ఓ న్యాయవాది తలనొప్పి, జ్వరం లక్షణాలతో ఓ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయడంతో పాటు ఆధార్ కార్డు తీసుకున్నారు. అయితే నమూనా పంపేటప్పుడు ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా హాస్పటల్ ఉద్యోగి ఫోన్ నెంబర్ పెట్టారు. ఇక్కడే ఈ హాస్పటల్ వాళ్లు డబుల్ గేమ్ ఆడారు. ఆ న్యాయవాది కరోనా రిపోర్టు ఆ ఉద్యోగి ఫోన్ నెంబర్‌కు వచ్చింది.
సదరు న్యాయవాదిని మూడు రోజుల పాటు కోవిడ్ వార్డులో ఉంచారు. నెగిటివ్ వచ్చినా కరోనా చికిత్స చేయిస్తున్నట్టు నాటకం ఆడారు. చివరకు ఆ న్యాయవాది గట్టిగా ప్రశ్నించడంతో రిపోర్టు ఇచ్చారు. అందులో నెగిటివ్ అని ఉంది. చివరకు సదరు న్యాయవాది తోటి న్యాయవాదులకు ఈ విషయం చెప్పడంతో వాళ్లంతా ఒత్తిడి చేయడంతో ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. అయితే నాలుగు రోజులకు రు. 3 లక్షల బిల్లు చెల్లించాకే వారు డిశ్చార్జ్ చేశారు. ఈ హాస్పటల్ తీరుపై ఆయన పంజగుట్ట పోలీసులకు ఆస్పత్రి తీరుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనిని బట్టి హైదరాబాద్ ప్రైవేటు హాస్పటల్స్ ఎంత దారుణాలకు తెగబడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.